ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:33 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వెంకన్న సన్నిధి… వికలాంగుల పెన్నిధి తిరుమల వెళ్లలేని దివ్యాంగుల కోసం “ట్రస్ట్” సాయం ఖర్చులన్నీ వాళ్లవే ఏడుకొండలవాడి చెంతకు వెళ్లలేని వారికి అండగా నిలుస్తోన్న “శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌”

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భారత పుణ్యక్షేత్రాలలో “తిరుమల” ఒకటి. ఏడుకొండలపై విష్ణుమూర్తి అవతారంలో కొలువై ఉన్న ఆ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ కోనేటి రాయుడిని కనులారా చూసి, మనసారా వేడుకుంటారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే, చాలా మంది భక్తులు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకుంటే మరి కొద్దిమంది మాత్రం జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నా చాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఒక్కసారి కూడా ఏడుకొండలవాడిని చూసుకోలేని వారికి అండగా నిలుస్తోంది ఓ సంస్థ. అదే “శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌”. నిరుపేదలు, దివ్యాంగులకు ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యం కల్పిస్తోంది.

తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే, చేతిలో డబ్బులు లేని కారణంగా కొద్దిమంది ఆ కోరికను తుంచుకుంటే దివ్యాంగులు వాళ్ల లోపం కారణంగా వెళ్లలేకుంటారు. అలాంటి వారందరికీ తిరుమలేశుడి దర్శన భాగ్యం కల్పిస్తోంది “శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌”.

సంస్థకు పునాది ఆ ఆలోచనే

హైదరాబాద్కు చెందిన చుక్కల వేణుకుమార్ అనే వ్యాపారికి ఒకరోజు “ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోని వాళ్లుంటారా?” అనే సందేహం వచ్చిందట. ఆ క్రమంలోనే ఓసారి నాగోల్‌లో ఉన్న ఒక గుడికి వెళ్లినప్పుడు “తిరుపతికి వెళ్లని వాళ్లున్నారా” అంటూ మైక్‌లో అడిగించారట. దీంతో “మేం వెళ్లలేదు” అని చాలా మంది చెప్పడం చూసి ఆశ్చర్యపోయారట. దాంతో తన సొంత డబ్బులతోనే కొందరు మురికివాడ ప్రజల్ని ఏడుకొండలు ఎక్కించారు వేణుకుమార్‌. తిరుమలకి వెళ్లాలని ఉన్నా పేదరికంతో వెళ్లలేనివారి కోసమే స్నేహితులతో కలిసి 2014లో “శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌”ను ఏర్పాటు చేశారు.

ఖర్చులన్నీ ట్రస్ట్ తరఫునే

సమాజంలోని పేదలు, దివ్యాంగులకు ఆధ్యాత్మిక సేవలు అందించే ఒక ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది. జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండను సందర్శించి, శ్రీవారిని దర్శించుకోవాలని ఆశపడే దివ్యాంగులు, అంధులు, అనాథలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలు, జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా తిరుమల కొండను సందర్శించని భక్తులకు ఈ ట్రస్ట్ పూర్తిగా ఉచితంగా తిరుపతి యాత్రను ఏర్పాటు చేస్తుంది. భక్తులకు తిరుమల వెళ్లడానికి రానూపోనూ ఛార్జీలూ, వసతి, భోజనం అన్నీ వాళ్లే చూసుకుంటారు.

వాలంటీర్లు కూడా సిద్ధం

ఈ ట్రస్ట్‌లో “గరుడ సేన” అనే వాలంటీర్ల బృందం పనిచేస్తుంది. తిరుమల యాత్రకు వచ్చే దివ్యాంగులకు, వృద్ధులకు కొండపై నడవడానికి, వీల్ చైర్ సదుపాయం కల్పించడానికి, సురక్షితమైన దర్శనం చేయించడానికి ఈ వాలంటీర్లు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు.

టీటీడీ బోర్డు సాయం

ఈ ట్రస్టు సేవలకి సాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత వసతి, దర్శన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 3000 మంది భక్తులకు వెంకన్న దర్శనభాగ్యం కల్పించిందీ ట్రస్టు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఈ ఉచిత సేవలను పొందడానికి ట్రస్ట్ అధికారిక మార్గాల ద్వారా ముందే పేరు నమోదు చేసుకోవాలి. అందుకోసం ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ sascct.org లో లేదా వారి వాట్సాప్ నెంబర్ 96661 59999 అందించే గూగుల్ ఫారమ్‌ను పూరించాలి.
అప్లై చేసుకునే సమయంలో భక్తుని ఆధార్ కార్డ్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ లేదా నిరుపేదలయితే రేషన్ కార్డ్ జిరాక్స్లను అందించాలి.
ఈ యాత్రకు సంబంధించిన నమోదు ప్రక్రియ, తదుపరి యాత్ర ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవడానికి మీరు నేరుగా ట్రస్ట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఈ ట్రస్ట్ మల్కాజ్గిరిలో ఉంది.
అనేది ప్రధానంగా శారీరక వికలాంగులు, అనాథలు, నిరుపేదలకు ఉచిత తిరుమల దర్శనం కల్పించేందుకు ఏర్పాటయిన ఒక స్వచ్ఛంద సంస్థ.